సంస్కృతి
శివరాత్రి అంతరార్థము
శివరాత్రికి మరొక అర్థం కూడా ఉంది. ఈ రాత్రికి, మనస్సుకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది. 'చంద్రమా మనసో జాత:' చంద్రునికి, మనస్సుకు సబంధముంటుంది. చంద్రునిలోని కళలు 16. ఈ పదహారు కళలలో ఈ రాత్రి 15 కళలు లయమై ఒక్క కళ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ రాత్రంతా ఒకే కళ ఉంది. కనుక, దానిని తప్పక మనము సాధించవచ్చు. ఒక్క వ్యక్తి 16 మందితో యుద్ధం చేయాలంటే చాలా కష్టం. 16 మంది ఒక్కనితో యుద్ధం చేయడం చాలా సులభం. ఈనాడు మనస్సులో ఒకే శక్తి ఉంటున్నది. దీనిని సాధించాలనంటే, దైవచింతన చేసి సాధించాలి. దీనిలో విజయాన్ని సాధిస్తామనే విశ్వాసంతో ప్రాచీన ఋషులు ఈనాటి రాత్రి అంతా దైవచింతన చేసేవారు. వారు మనస్సులో ఉండిన 16 కళలను దైవంలో లీనం చేసుకున్నారు. అదియే జ్యోతిర్లింగ దర్శనం.
శివరాత్రి అనగా మంగళకరమైన రాత్రి. కనుక, దైవచింతన చేత మనము దిగ్విజయాన్ని సాధించాలి. ప్రాచీన ఋషులు ఈవిధమైన కర్మలనాచరించి ఫలితమును పొందుతూ వచ్చారు. దుర్గుణములు, దుశ్ఛింతనలు ఈనాడు మనలో ప్రవేశించకుండా చూసుకోవాలి. మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, మనలో దైవమున్నాడు. మనమే దైవమనే నమ్మకాన్ని పెంచుకోవాలి. మనం తెల్సుకోవలసింది ఏమిటంటే, మనలో దైవమున్నాడు. మనమే దైవమనే నమ్మకాన్ని పెంచుకోవాలి. దృఢమైన నమ్మకమును పునాదిగా వేసుకుంటే ఎన్ని బాధలు వచ్చినా మనం ఎదుర్కోగలం. దైవము ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. దైవము ఉన్నాడు, ఉన్నాడు. ఎక్కడ? మనమే మనమే!
శివరాత్రి జాగరణ
భారతీయ పర్వదినములన్నీ దైవత్వాన్ని చింతింపజేయునవే, దైవత్వాన్ని జ్ఞప్తికి తెప్పించునవే. కానీ, ఈనాడు దైవత్వాన్ని మననం చేయడం మానివేసి తిండితీర్ధాదులతోనూ, పాయస పరమాన్నములతోనూ పర్వదినములను అనుభవిస్తున్నాము. ఈనాడు శివరాత్రి పర్వదినం. ఈ రాత్రంతా భగవన్నామ స్మరణతో కాలాన్ని సార్థకం చేసుకొన్నప్పుడు జీవితమే పవిత్రమైపోతుందని దీని అంతరార్థం. కనుక, ఈ ఒక్క రాత్రి అయినా శివనామస్మరణతో జాగరణ చేయండి. సంవత్సరమునకు ఒక్క దినమైనా భగవన్నామమును 24 గంటలసేపు ఉచ్చరించండి. ఈ రాత్రంతా దైవచింతన చేస్తూ మేలుకోవాలి. అంతేకాని మూడు సినిమాలకు పోవడం, నాలుగు టీవీ ప్రోగ్రాములు చూడడం జాగరణ కానేరదు. 'పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినంతనె అది జాగరణమగునా?' కార్డ్స్ ఆడుతూ రాత్రంరా మేలుకొంటే అది జాగరణ అవుతుందా? కాదు, కాదు. దైవచింతనతో రాత్రంతా గడపడమే నిజమైన జాగరణ.
లింగ ఉత్పత్తి -లింగోద్భవం
స్వర్ణము, ఇనుము ఇత్యాది అనేక లోహములు మానవునియందే ఇమిడియున్నవి. ''రసోవై స:'' రసముతో కూడినది ఈ దేహము. లింగోద్భవమంటే ఏమిటి? భగవంతుడు హిరణ్యగర్భుడు. తన ఉదరము హిరణ్యమయంగా ఉన్నది. ఈ రసస్వరూపమైన హిరణ్య మంతా తిరిగి తిరిగి ఒక దగ్గర చేరి లింగాకృతిని దాల్చుతుంది. లింగము అనగా చిహ్నము. ఒక గుర్తు. దీనికి కన్ను, ముఖము, నోరు... మొదలైన అంగములు లేవు. ఏది తల, ఏవి కాళ్లు అనేది చెప్పడానికి వీలుకాదు. ''లీయతే గమ్యతే ఇతి లింగ:'' (దేనిలో అన్నీ లీనమవునో, దేనికై అన్నీ గమించునో అది లింగము) ఇది లోపల తయారై బహిర్ముఖంగా బయలుదేరుతుంది. ఇది కరిగి లింగముగా తయారు కావాలంటే ఎంతో వేడి కావాలి. అదియే లింగోద్భవ సమయంలో కలిగి బాధ. ఇది లింగాకారము ధరించి బయటికి రావాలి. ఇది బయటికి వచ్చే సమయంలో స్వామికి బాధ కలుగుతోందని మీరు భావిస్తున్నారు. కాని, ఇది బాధ కాదు. ఇది మీకొక బోధ. తల్లి గర్భమునందున్న శిశువు బయటికి రావాలంటే తల్లికి కొంత బాధ తప్పదు కదా! ''అబ్బా! ఈ పాడుబిడ్డ నన్ను ఎంత బాధ పెడుతోంది!'' అని ఏ తల్లియైనా తిట్టుకుంటుందా? తన బిడ్డ సుక్షేమంగా ఉండాలనే ఆశిస్తుంది. అదేవిధంగా, లింగోద్భవము జరిగేటప్పుడు ఇంతమందికి గొప్ప బోధ గావిస్తున్నావని ఆనందిస్తానే గాని, అది నాకు బాధ అని నేను భావించను. కాని, కొందరు ''స్వామికి ఇంత కష్టమా! ఇంత బాధనా!'' అని అనుకుంటారు. దైవత్వమునకు ఎట్టి బాధలూ ఉండవు, ఎట్టి విచారములూ ఉండవు, ఎట్టి కష్టములూ కలుగవు. ఇవి తయారు కావడానికి రెండు దినములనుండి నా శరీరమంతా మ్యాగ్నెట్‌గా మారిపోయింది. నేను దేనిని ముడితే అది చేతికి కరుచుకుంటోంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నా పాదాలు భూమికి కరుచుకుంటున్నాయి. కనుక, అడుగు తీసి అడుగు వేయడానికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఈ అయస్కాంతశక్తి అందరియందు ఈ విధంగా ఉండదు. దివ్యత్వమునందు మాత్రమే ఇది ఇంత శక్తిమంతంగా ఉంటుంది. రెండు దినములనుండి నాకు నడవటానికి వీలులేకుండా ఉన్నది. అయితే, అది నాకేమీ కష్టం కాదు. దేహమంతా మ్యాగ్నెట్‌గా మారిపోయింది కాబట్టి, అది సహజమే. టంబ్లరును ముట్టుకుంటే అది అట్లే చేతికి కరుచుకునేది. ఇవన్నీ ఇతరులకు చెప్పేవి కావు. ఇలాంటి అయస్కాంతశక్తి ప్రతి మానవునియందున్నది. ఐతే, కొంత పరిమితిలో ఉంటుంది. కాని, దైవత్వంయొక్క శక్తి అపరిమితమైనది.
(స్వామి తాము సృష్టించిన సువర్ణలింగాన్ని చూపిస్తూ) చూడండి, దీని సైజు పెద్దదిగా ఉన్నది. దీనికొక అంతరార్థము లేకపోలేదు. దీని బరువు ఐదు తులాలు. మన దేహములో కూడా ఐదు తులాల సువర్ణరసమున్నది. దీనినే హిరణ్యగర్భుడన్నారు. మీకు తెలిసియుండవచ్చు -వైద్యులు ఒక్కొక్కసారి సువర్ణము కలిపిన మందులిస్తారు. సువర్ణమే మానవునికి ప్రధానమైన శక్తి. సువర్ణమువలననే మానవునిలో తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. మన దేహములోని బంగారమంతా ఇంతమాత్రమే. కన్నులలో ప్రవేశించి కాంతిని కలిగించేది ఇదియే. దీనివల్లనే చెవులు వినగలుగుతున్నాయి. నాలుక రుచి చూడగలుగుతున్నది. ఈ సువర్ణరసము దేహమంతా సంచరిస్తూ కాపాడుతూ ఉంటుంది. మన చర్మము క్రింద అత్యంత పలుచనైన తెల్లచర్మం ఉంటుంది. అది కట్ అయినప్పుడే రక్తం వస్తుంది, లేకపోతే రాదు. మన రక్తమును కాపాడేందుకు భగవంతుడు ఈ తెల్లచర్మమును ఏర్పాటు చేశాడు. భగవంతుడు ఏది చేసినా మన రక్షణకోసమే, మన క్షేమంకోసమే. (2002)
ఆత్మ సినిమా తెరవంటిది, అది శివుడే
ప్రపంచంలో ప్రతి మానవునకు సత్యమును నిరూపించే విచిత్రములెన్నియో కన్నులకు కట్టినట్లున్నవి. ప్రతి విచిత్రము ఒక చరిత్రను నిరూపిస్తుంది. సినిమా తెరపైన అనేక బొమ్మలను చూస్తున్నాము. తెరపైన నదులు పొంగి ప్రవహిస్తూ జలమయమైనట్లు కనిపిస్తుంటాయి. నదులు పొంగి పొంగి ప్రవహించుట మన కనులకు కనిపిస్తుందిగాని ఈ జలము తెరను కించిత్తయినా తడుపుట లేదు. అదే తెరపైన అగ్ని పర్వతములు ప్రజ్వలిస్తూ కనిపిస్తుంటాయి, తెర కించిత్తయినను కాలటం లేదు. ఇన్ని బొమ్మలకూ ఆధారమై, నిలయమై ప్రకటించుటకు ప్రధాన సూత్రంగా ఉన్న తెర మంచికికాని, చెడుకికాని తనకేమాత్రం సంబంధం లేనట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా మానవుని జీవితంలో మంచిచెడ్డలు, సుఖ దు:ఖములు, జననం మరణములు, ఆనంద ఆహ్లాదములు, అనేకం వస్తూపోతూ ఉంటాయి. కానీ, ఆత్మకు ఏమాత్రమూ సంబంధం ఉండదు. సినిమా తెర వంటిదే ఈ ఆత్మ. ఇదే శివుడు. ఇదే శంకరుడు. ఇదే దైవం.
సర్వత్రా సత్తామాత్ర చైతన్యం
శంకరత్వంనకు సరియైన అర్థమును గుర్తిచింతినప్పుడే సార్థకమైన రీతిలో దీనిని అనుభవించుటకు సాధ్య మవుతుంది. శంకరుడనగా సకలైశ్వర్య స్వరూపుడు. ఐశ్వర్యమనగా ఏమిటి? లోకరీతిగా మనమనుభవించేవి ఐశ్వర్యములు కావు. దృశ్య కల్పితమైన, చరాచర ప్రపంచంలో ఉండు ప్రతి పదార్థము ప్రతి 'వ్యక్తి' ఐశ్వర్యంతో కూడుకొని ఉండేదే. పంచ భూతములు, పంచప్రాణములు, పంచ కోశములు, పంచేంద్రియములు సర్వం ఐశ్వర్యములే. ఇంతేకాదు. చరాచర జీవరాసులన్నీ కూడా ఐశ్వర్యముతో కూడుకున్నవే. ఈ ఐశ్వర్యత్వమే ఈశ్వరత్వము. ఏతావాతా ఈశ్వరత్వమనగా దృష్య కల్పిత చరాచర జగత్తు సర్వం అనే సత్యాన్ని గుర్తించాలి. దీనినే సత్తామాత్ర చైతన్యమన్నారు. అనగా సత్యమై, నిత్యమై, శాశ్వతమై, అగోచరమై, అదృశ్యమైన ఈ చైతన్యమే సర్వత్రా ఉన్నది. చైతన్యము అఖండ స్వరూపమైనటువంటిది.
ఈ చైతన్యమును రెండు విధాలుగా విభజించారు ప్రజలు. ఒకటి లౌకికము, రెండవది వైదికము. ఈశ్వరత్వమునకు సగుణ సాకారమని ఒకటి, నిర్గుణ నిరాకారమని మరొకటి రెండు రూపములు. మానవుని బాధలను, కష్ట సుఖములను గుర్తించి, వాటి నివారణ నిమిత్తమై మనో సంకల్పములతో నిర్మించుకున్నవి సగుణ సాకార రూపములు. ఈ సగుణ సాకార రూపములనేవే మూర్తులు. ఇక్కడ మూర్తులనగా లోకరీతిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరే త్రిమూర్తులు.
ముగ్గురు మూర్తులు భ్రమ మాత్రమే!
ఈ త్రిమూర్తులలో ఒక్కొక్క మూర్తిలో తిరిగి మూడు మూర్తులున్నారు. ఈ మూర్తులలో గుణత్రయమైన మూర్తిత్వం కూడా అంతర్భూతమై ఉంటున్నది. ఇవియే సాత్విక రాజసిక తమో గుణములు. వీటినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులన్నారు. బ్రహ్మ అనగా రాజసికము, విష్ణువు అనగా సాత్వికము, శివుడు అనగా తామసికము. ఇవియే మూర్తిత్రయములైన సగుణ స్వరూప సాకారములు. ఈ రాజసికములో 'అ' కారము బ్రహ్మత్వమునకు విశ్వరూపమై ఉంటుంది. సాత్విక రూపమునకు స్వస్వరూపమైనది 'ఉ' కారమైన విష్ణు స్వరూపము. శివస్వరూపమునకు స్వస్వరూపమైనది 'మ'కారము. ఈ మూడింటి సాకార ఆరాధనే సగుణోపాసన, లౌకికోపాసన. సగుణారాధనయందు ప్రతి మానవునిలోనూ 'అ' కారమనే బ్రహ్మ '' కారమనే విష్ణువు, 'మ' కారమనే ఈశ్వరుడు సాక్షీభూతులై నితంరతం మంగళకర స్వరూపాన్ని నిరూపిస్తున్నారు. ఈ మూర్తిత్రయములైన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపములు శాశ్వతములు కావు. కారణమేమనగా, భౌతిక దేహము ధరించి యుండడంచేత భౌతిక లౌకికములు మాత్రమే లక్ష్యములు కనుక, ఇవి భ్రమ స్వరూపములు, సంకల్ప ప్రభావములు, మనో వృత్తుల ఆకారములు. అయితే, ఇట్టి సగుణాకార, సగుణ స్వరూప మనోసంకల్పములతో కూడిన ఆకారములు మూడింటిలోనూ ఏకాత్మయైన నిరాకార తత్త్వము -అదియే ఈశ్వరుని యందున్న మరొక ఈస్వరత్వము. అదే అక్షర స్వరూపమైనటువంటి దైవం ఆకారం.
విశ్వాస శ్వాసయే శివం
ఇలాంటి దివ్యమైనటువంటి మార్గములు నిరూపించిన పవిత్ర పురుషులైన మహర్షులు భారతదేశమునందు అనాది కాలమునుండి పర్వదినములు ఏర్పరచి, బోధించి అంతరార్థములను ప్రజలకు చాటుతూ వచ్చారు. శివం అనగా మంగళం. జీవితం మంగళకరమైనది. మంగళకరమైన శివం లేని స్థానము జగత్తులో కానరాదు. సర్వమూ మంగళమే. మన మనోతత్త్వం అధోగతిని ప్రవేశించడం చేత కొన్ని అమంగళాలు కలుగుతూ ఉంటాయి. మంగళ అమంగళములకు కారణమేమిటి? మంగళం లేనిది అమంగళం. అమంగళం కానిది మంగళం. మన దేహంలో సత్తామాత్ర చైతన్యం నఖ శిఖ పర్యంతం సంచరిస్తూన్నంతవరకు ఈ దేహం మంగళం. మంగళమైన చైతన్యముండినంతవరకు ఇదే శివం.
అయితే ఈ చైతన్యం దృశ్య రహితమై సర్వత్రా వ్యాపించి ఉన్నా ఒక్కొక్కతూరి దేహమును వదిలిపెట్టినట్లుగా కనిపిస్తుంది. అప్పుడే అది అమంగళంగా మారుతుంది. అమంగళంలోకూడా మంగళ మున్నది. అయితే, అంతర్దృష్టితో విచారణ సలుపక అమంగళంగా భావించిన ఈ దేహమే శివంగా మారిపోతుంది. విశ్వాసమనే శ్వాస (ఇదియే శివం) ఉండినంతవరకు మంగళం. ఈ విశ్వాసమనే శ్వాస లేకుండాపోయినప్పుడు ఇది అమంగళమనే శవంగా మారిపోతుంది.
దివ్య జీవితానికి ప్రాతిపదికము ఆత్మ. శరీరము ఆత్మకు క్షేత్రము. ఆధ్యాత్మిక జీవితమునకు సాంఘిక జీవితము అనుగుణంగా ఉండాలి. కాని, ఈనాటి మానవుడు దేహమునే సత్యముగా విశ్వసించుటచేత 'ఆత్మజ్ఞానము' ప్రబోధించవలసి వచ్చింది.
వ్యక్తియొక్క పరిణామమునకు, సాంఘిక పరిణామమునకు మూలాధారము ఈశ్వరేచ్ఛయే. ఈశ్వరేచ్ఛ యొక్క ప్రతిబింబమే సమాజము. ఇట్టి స్థానము నుండి మానవుడు ప్రవర్తింనప్పుడే అహంకార ప్రమేయమే లేక మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వహించగలడు. కనుక, మానవునియొక్క ప్రధాన ధర్మము ఈశ్వరేచ్ఛయే.
రాశి ఫలాలు






