క్రీడాప్రభ
స్టేన్ ధాటికి కుప్పకూలి ఫాలో ఆన్ అయిన ఇండియా
నాగపూర్, ఫిబ్రవరి 8 : నాగపూర్ విసిఎ స్టేడియంలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్ట్‌లో దక్షిణాఫ్రికా (ప్రోటియాస్) పేస్ బౌలర్ డేల్ స్టేన్ ప్రళయ భీకర స్పెల్ ఫలితంగా భారత జట్టు ఫాలో ఆన్ కావడమే కాకుండా ప్రత్యర్థి జట్టుతో తిరిగి బ్యాట్ చేయించడానికి రెండవ ఇన్నింగ్స్‌లో ఇంకా 269 పరుగులు స్కోరు చేయవలసిన దుస్థితిలో పడింది. ఈ టెస్ట్‌కు ఇంకా పూర్తిగా రెండు రోజుల వ్యవధి ఉంది. స్టేన్ 51 పరుగులకు ఏడు వికెట్లతో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 335 పరుగుల మేర వెనుకబడిన టీమ్ ఇండియా రెండవ ఇన్నింగ్స్‌లో మరిన్ని కష్టాలలో పడింది. ఓపెనర్లు ఇద్దరినీ దక్షిణాఫ్రికా పేసర్లు పెవిలియన్ ముఖం పట్టించారు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. 24 పరుగులకు జట్టు రెండు వికెట్లు కోల్పోయిన తరువాత జత కలిసిన మురళీ విజయ్ 27, సచిన్ టెండూల్కర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఫాలో ఆన్ చేయవలసిందని దక్షిణాఫ్రికా కోరిన మీదట తమ రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియాకు ఓపెనర్లు శుభారంభం చేయవలసిన అవసరం ఉంది. కాని గౌతమ్ గంభీర్ మరొక సారి అత్యల్ప స్కోరుకు అవుటయ్యాడు. రెండవ ఇన్నింగ్స్ రెండవ ఓవర్‌లోనే గంభీర్ ఒక పరుగుకు మోర్నె మోర్కెల్ ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరొక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడు బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అతను నాలుగు బౌండరీలతో తన 16 పరుగుల స్కోరు సాధించాడు. కాని ఆతరువాత స్టేన్ ఓవర్‌లో బంతి సెహ్వాగ్ బ్యాట్ అంచు తగిలి మొదటి స్లిప్‌లో గ్రేమ్ స్మిత్ వద్దకు వెళ్ళింది. స్మిత్ ఏమాత్రం పొరపాటు చేయలేదు. ఫలితంగా ఇండియా రెండవ వికెట్ 24 స్కోరు వద్ద పతనమైంది. అంతకుముందు, టీ విరామానంతరం డేల్ స్టేన్ ప్రళయ భీకర స్పెల్, పాల్ హారిస్ ఇండియా బ్యాటింగ్‌ను దెబ్బ తీశారు. స్టేన్ ఈ స్పెల్‌లో 3.4 ఓవర్లలో రెండు మెయిడెన్లు వేసి కేవలం ఒక పరుగు ఇచ్చి ఐదు వికెట్లు పతనం గావించాడు. హారిస్ మరొక వికెట్ నష్టపరిచాడు. దీనితో ఇండియా 7.4 ఓవర్లలో 12 పరుగులకు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్‌ను హారిస్ తీసుకున్ తరువాత స్టేన్ తన తడాఖా చూపాడు. బంతి మెరుస్తున్న దశలోనే వేగంతో, కచ్చితమైన గురితో, స్వింగ్‌తో స్టేన్ బౌలింగ్ చేసి భారత జట్టు చివరి వికెట్లను పడగొట్టాడు. మొదటిసారిగా టెస్ట్ ఆడుతున్న ఎస్. బదరీనాథ్ వికెట్‌ను టీ విరామానంతరం రెండవ ఓవర్‌లో స్టేన్ తీసుకున్నాడు. స్టేన్ వేసిన బంతిని బదరీనాథ్ నేరుగా షార్ట్ మిడ్‌వికెట్ ఫీల్డర్ దిశగా కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లోకి కొత్తగా ప్రవేశించిన మరొక క్రీడాకారుడు వృద్ధిమాన్ సాహా, స్టేన్ నుంచి తాను ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. స్టేన్ బంతులను జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా ఒక అడుగు వెనుకకు వేసి ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యారు. హర్భజన్ సింగ్ ఎల్‌బిడబ్ల్యు కింద అవుటవడంతో ప్రపంచ నంబర్ వన్ బౌలర్ స్టేన్‌కు అతని కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు లభించాయి. ఉదయం సెహ్వాగ్ ఎంత బాధ్యతాయుతంగా బ్యాట్ చేసి 18వ టెస్ట్ సెంచరీ స్కోరు చేసాడో అంతే బాధ్యతారహితంగా తన వికెట్‌ను పారవేసుకున్నాడు. కొత్తవాడు బదరీనాథ్‌తో కలసి సెహ్వాగ్ నాలుగవ వికెట్‌కు 136 పరుగులు జోడించి భారత ఇన్నింగ్స్‌కు తిరిగి ప్రాణం పోశాడు. మూడు వికెట్లకు 119 స్కోరు వద్ద భారత ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సెహ్వాగ్ ప్రోటియాస్ బౌలింగ్‌ను ఒక వైపు చీల్చిచెండాడినా, మరొకవైపు పరిస్థితిని బట్టి ఆచితూచి కూడా బ్యాట్ చేశాడు. లంచ్ అనంతరం స్టేన్ ఓవర్‌లో సెహ్వాగ్ స్క్వేర్ కట్‌తో బౌండరీని సాధించాడు. రెండవ వైపు మోర్కెల్ బంతిని బదరీనాథ్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి కొట్టాడు. అటుపిమ్మట జాక్విస్ కలిస్ బంతిని ఆఫ్‌సైడ్‌కు కొట్టి సింగిల్‌తో తన 18వ సెంచరీ స్కోరు చేశాడు. అతను కేవలం 134 బంతులలో సెంచరీ సాధించాడు. అతను 13 బౌండరీలు కొట్టాడు. ఆదశలో కలిస్‌ను తప్పించి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ వేయిన్ పార్నెల్‌ను స్మిత్ తీసుకువచ్చాడు. పార్నెల్ మొదటి ఓవర్‌లో సెహ్వాగ్ రెండు బౌండరీలు కొట్టాడు. కాని ఆతరువాత పార్నెల్ వికెట్‌కు కొంత దూరంగా వేసిన బంతిని సెహ్వాగ్ ధాటీగా కొట్టబోయి డీప్ కవర్‌లో జెపి డూమినీకి క్యాచ్ ఇచ్చాడు. సెహ్వాగ్ తన బ్యాట్‌ను అడ్డుపెట్టకపోయి ఉంటే ఆ బంతిని వైడ్‌గా అంపైర్‌గా పరిగణించి ఉండేవారు. జట్టు స్కోరు 192 వద్ద నాలుగవ వికెట్‌గా సెహ్వాగ్ అవుటయ్యాడు. గడచిన రెండేళ్ళుగా జట్టులో సభ్యుడుగా ఉంటున్నా మొదటిసారిగా ఇప్పుడే టెస్ట్ ఆడుతున్న సుబ్రహ్మణ్యం బదరీనాథ్ షార్ట్ బంతులను ధీరోచితంగా ఎదుర్కొన్నాడు. ఆదిలో నింపాదిగా ఆడినా తరువాత అతను వికెట్‌కు రెండు వైపులా కొన్ని మంచి షాట్లు కొట్టాడు. అతను 123 బంతులు ఎదుర్కొని 50 పరుగులు స్కోరు చేశాడు. అతని ఫిఫ్టీలో ఆరు బౌండరీలు ఉన్నాయి. కాని అతను 56 స్కోరు వద్ద అవుటయ్యాడు.
స్కోర్ బోర్డు
దక్షిణాఫ్రికా (మొదటి ఇన్నింగ్స్): ఆరు వికెట్లకు 558 డిక్లేర్డ్
ఇండియా (మొదటి ఇన్నింగ్స్): గౌతమ్ గంభీర్ (సి) బౌచర్ (బి) మోర్కెల్ 12, వీరేంద్ర సెహ్వాగ్ (సి) డూమినీ (బి) పార్నెల్ 109, మురళీ విజయ్ (బి) స్టేన్ 4, సచిన్ టెండూల్కర్ (సి) బౌచర్ (బి) స్టేన్ 7, ఎస్ బదరీనాథ్ (సి) ప్రిన్స్ (బి) స్టేన్ 56, మహేంద్ర సింగ్ ధోని (సి) కలిస్ (బి) హారిస్ 6, వృద్ధిమాన్ సాహా (బి) స్టేన్ 0, హర్భజన్ సింగ్ (ఎల్‌బిడబ్ల్యు బి) స్టేన్ 8, జహీర్ ఖాన్ (బి) స్టేన్ 2, అమిత్ మిశ్రా (బి) స్టేన్ 0, ఇశాంత్ శర్మ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 29, మొత్తం (64.4 ఓవర్లలో) 233
వికెట్ల పతనం: 1..31, 2..40, 3..56, 4..192, 5..221, 6..221, 7..222, 8..226, 9..228, 10..233
బౌలింగ్: డేల్ స్టేన్ 16.4 7 51 7, మోర్నె మోర్కెల్ 15 4 58 1, పాల్ హారిస్ 17 2 39 1, వేయిన్ పార్నెల్ 7 1 31 1, జాక్విస్ కలిస్ 6 0 14 0, జెపి డూమినీ 3 0 20 0
ఇండియా (రెండవ ఇన్నింగ్స్): గౌతమ్ గంభీర్ (బి) మోర్కెల్ 1, వీరేంద్ర సెహ్వాగ్ (సి) స్మిత్ (బి) స్టేన్ 16, మురళీ విజయ్ బ్యాటింగ్ 27, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ 15, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (23 ఓవర్లలో) రెండు వికెట్లకు 66
వికెట్ల పతనం: 1..1, 2..24
బౌలింగ్: డేల్ స్టేన్ 4 0 14 1, మోర్నె మోర్కెల్ 6 2 21 1, వేయిన్ పార్నెల్ 2 0 12 0, పాల్ హారిస్ 7 3 12 0, జాక్విస్ కలిస్ 4 2 5 0
రాశి ఫలాలు






