కడప
మునిసిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణపై శిక్షణ
జమ్మలమడుగు, ఫిబ్రవరి 8 (కెఎన్‌ఎన్): జమ్మలమడుగులోని పట్టణ ఇందిరా క్రాంతి పథం (మెప్మా) భవనంలో మునిసిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణపై శానిటరీ మేస్త్రీలకు, డ్రైవర్లకు, పబ్లిక్ హెల్త్ వర్కర్లకు సోమవారం సాయంత్రం శిక్షణా కార్యక్రమం మునిసిపల్ కమీషనర్ టికె మధుకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్ వైస్ ఛైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి (సూర్యం) మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యం కలిగించేందుకు పారిశుద్ధ్యంపై అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాలను సేకరించే సమయంలో చేతులకు తొడుగులను వాడాలని, పాద రక్షలు తప్పనిసరిగా ఉపయోగించాలని, వ్యర్థ పదార్థాలన్నింటిని తడి, పొడి చెత్తలుగా సేకరించాలని, వ్యర్థ పదార్థాలను కాల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యర్థ పదార్థాల నిర్వహణలో పబ్లిక్ హెల్త్ వర్కర్ల పాత్ర ముఖ్యమైందని, వీరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని, చేతులకు గాయాలు లేకుండా జాగ్రత్త పడాలని, పని పూర్తి అయిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, ప్రతి రోజూ తప్పనిసరిగా స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలని సూచించారు. పర్మనెంట్ సిబ్బందికి పాద రక్షలు, దుస్తులు సరఫరా చేస్తామని, కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సిబ్బందికి మాత్రం ప్రభుత్వం ద్వారా దుస్తులు, పాద రక్షలు సరఫరా కాలేదని స్పష్టం చేశారు. మునిసిపల్ కార్మికులకు జీతాలు బాగా పెరిగాయని, సక్రమంగా పని చేయాలని కోరారు. పట్టణ పరిధి బాగా పెరిగిందని, రోడ్లు ఊడ్చే సమయంలో చెత్తను కాలువల్లోకి తోయడం తగదని, కాలువలు పూడిపోతే సిబ్బంది లేనందువల్ల ఇబ్బంది తప్పదని మునిసిపల్ వైస్ సూర్యం హెచ్చరించారు. మునిసిపల్ కమీషనర్ మధుకుమార్ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలను కాల్చడం ద్వారా విషపూరితమైన వాయువులు వాతావరణంలో కలిసి క్యాన్సర్, ఆస్తమా, చర్మ వ్యాధులను కలుగుజేస్తాయన్నారు. తడి చెత్తను సేంద్రీయ ఎరువుల తయారీలో ఉపయోగించి భూసారాన్ని పరిరక్షించవచ్చన్నారు. అలాగే పొడి చెత్తను రీసైక్లింగ్ చేసి తయారు చేయగల వస్తువులను గురించి వివరించారు. హైదరాబాద్‌లోని పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థకు చెందిన అకౌంటెంట్ ఉమా శంకర్, రికార్డ్ ఆర్గనైజర్ బాబూరావులు మాట్లాడుతూ వ్యర్థాలను వేరు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు తెలియయజేయాలని, చిత్తు కాగితాలను సేకరించే వారికి, ఇంటింటి చెత్తను సేకరించేవారికి శిక్షణ ఇచ్చి క్రమబద్ధంగా ఆదాయాన్ని కల్పించవచ్చన్నారు. గృహిణులకు, పని వారికి కార్యాచరణ శిబిరాలు, ముఖాముఖి కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇల్లు మరుగుదొడ్డిని కలిగి ఉండి బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టగలిగితే పర్యావరణ సమస్యలు తొలగిపోయి కాలుష్యం తొలగించబడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ శానిటరీ మేస్త్రీలు, డ్రైవర్లు, పబ్లిక్ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు.
రాశి ఫలాలు






