ముఖ్యాంశాలు
బిరుదురాజు రామరాజు అస్తమయం
హైదరాబాద్ : తెలుగు జానపద సాహిత్యానికి జీవం పోసిన మహోన్నత పరిశోధకుడు, మహా రచయిత డాక్టర్ బిరుదురాజు రామరాజు ఇకలేరు.. మరుగున పడ్డ 'మాణిక్యాల' శోధనే ప్రాణవాయువుగా జీవిస్తూ పరిశోధకులకు మార్గ నిర్దేశనం చేస్తూ వచ్చిన బిరుదురాజు రామరాజు తమ 85వ ఏట సోమవారం మధ్యాహ్నం పండుటాకులా రాలిపోయారు. బిరుదురాజు రామరాజు మరణంతో తెలుగు సాహిత్యం ఒక గొప్ప మౌలిక పరిశోధకుడిని, పండితుడిని, సాంప్రదాయక ఉన్నత విలువలు కలిగిన మహోన్నత గురువుని కోల్పోయింది. బిరుదురాజు భౌతిక కాయానికి సాయంకాలం అంబర్‌పేట స్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. వరంగల్ జిల్లాలో జన్మించిన బిరుదురాజు రామరాజుది చైతన్యశీల భూమిక. వందేమాతరం, ఆర్యసమాజ్ ఉద్యమాలలో ఆయన చురుకుగా విద్యార్థిదశలోనే పాల్గొన్నాడు. 1947 సెప్టెంబర్ 2న నిజాంకు వ్యతిరేకంగా తీసిన ఊరేగింపులో నిజాం పోలీసులు జరిపిన లాఠీఛార్జిలో రామరాజు తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు ఆయన్ని సరోజినినాయుడు కుమార్తె ప్రొఫెసర్ లీలామణినాయుడు తప్పించి చికిత్స చేయించారు. స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాల్లో పాల్గొన్నందుకు గాను మూడు నెలల జైలుశిక్షను కూడా ఆయన అనుభవించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చినా సురవరం ప్రతాపరెడ్డి ఆదేశం మేరకు సాహిత్యరంగంవైపే ఆయన మొగ్గు చూపారు. పల్లె పాటలు, పల్లె పదాలు జనం చెంతకు చేరేలాగా జానపద విజ్ఞాన విశ్వ దర్శనం చేయించిన సాహితీవేత్తగా, పరిశోధకుడిగా ఆచార్య బిరుదురాజు గూర్చి చెప్పుకుంటారు. ఆయన రాసిన 'తెలుగు జానపద గేయ సాహిత్యం' అనే సిద్ధాంత గ్రంథానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. జానపద విజ్ఞానం మీద తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాలుగు ప్రామాణిక గ్రంథాలు రచించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 50 మంది పరిశోధకు లకు డాక్టరేట్లు వచ్చాయి.
''ప్రయాణ సౌకర్యాలు పెద్దగా లేని ఆ రోజుల్లో పదేసి మైళ్ళు నడిస్తేగానీ పల్లెటూళ్ళు కనపడేవి కావు. టేపురికార్డర్లు లేవు.. పండుగలప్పుడు, జాతరలప్పుడు, కోతలప్పుడు, మోటతోలేటప్పుడు, వడ్లు, జొన్నలు దంచేటప్పుడు, స్త్రీలు, పురుషులు పాడుతుంటే వందల సంఖ్యలో పాటలు రాసుకున్నా.. వాళ్ళ ఎదుట నిల్చుంటే పాడరు. వావిలి పొదళ్ళో, ఈత తుప్పల్లో దాగుండి రాసుకునేవాడిని.. ఇండ్లకు వెళ్ళి స్త్రీలకు రవికె కణుములు ఇచ్చి, పురుషులకు బీడీలు, కల్లుకు పైసలిచ్చి పాటలు పాడించుకునేవాడ్ని'' అని బిరుదురాజు రామరాజు ఒక సందర్భంలో పేర్కొన్నారు.
ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు మొదలైన విలువైన పుస్తకాలను తెలుగువారికి ఆయన అందచేశారు. తెలుగుతోపాటు సంస్కృత సాహిత్యానికి కూడా ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఆయన పరిశోధనల కారణంగా సంస్కృత, తెలుగు సాహిత్యాల్లో తిమ్మయ్య రచించిన ''ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం'', ఛాయావతి ''రాఘవాభ్యుదయం'', పాల్కురికి సోమన ''పండితారాధ్యోదాహరణం'', రఘునాథనాయకుని ''వాల్మీకి చరిత్ర'', కదరీపతి ''శుకసప్తతి'', మడికి సింగన ''పద్మపురాణం'' లాంటి అమూల్యమైన పుస్తకాలు వెలుగుచూశాయి. శాసనాల సేకరణ, శాసనాలకు నకళ్ళు రాయడం పట్ల ఆయన చాలా ఆసక్తి చూపేవారు. అవార్డులకోసం రామరాజు ఎన్నడూ ప్రయత్నించలేదు. అవార్డులే ఆయన్ని వెతుక్కుంటూవచ్చాయి. 1995లో భారత ప్రభుత్వం ఆయన్ని జాతీయ పరిశోధనల ఆచార్యుడిగా నియమించింది. ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందిన తెలుగువాడు ఈయనొక్కడే.
తుది వీడ్కోలిచ్చిన సినారె, వరవరరావు
అంబర్‌పేట స్మశానవాటికలో జరిగిన బిరుదురాజు అంత్యక్రియల్లో ప్రముఖ కవులు, రచయితలు డాక్టర్ సి.నారాయణ్‌రెడ్డి, వరవరరావు, జయధీర్ తిరుమలరావు, అందెశ్రీ తదితరులు పాల్గొన్నారు. బిరుదురాజు మరణంతో తెలుగు సాహిత్యం ఒక గొప్ప పరిశోధకుడిని, పండితుడిని కోల్పోయిందని తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆవుల మంజులత సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యుడు చుక్కా రామయ్య తెలంగాణ రచయితల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు జూకంటి జగన్నాథం, గౌరీశంకర్, జానపద వాగ్గేయకారుడు గోరటి వెంకన్నలు కూడా బిరుదురాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
రాశి ఫలాలు






