ముఖ్యాంశాలు
తూర్పులో దొరికిన పశ్చిమ పందెంరాయుళ్ళు
కాకినాడ, (కెఎన్‌ఎన్ ప్రతినిధి) : సంక్రాంతి సీజన్ ముగిసినా కోడిపందాల జోరు తగ్గలేదు. జిల్లాలో పెద్దఎత్తున నిర్వహిస్తున్న కోడిపందాల్లో పాల్గొనేందుకు పశ్చిమగోదావరి నుంచి పెద్దఎత్తున పందెంరాయుళ్ళు ఇక్కడికి తరలివస్తున్నారు. కాగా సోమవారం తెల్లవారుఝామున జిల్లా ఎస్‌పి నాగిరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందం దాడి జరిపి ఓ ఎమ్మెల్యేతో సహా పలువురు పందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకుంది. రాజకీయ ఒత్తిళ్ళ మేరకు ఆ ఎమ్మెల్యేను విడిచిపెట్టారు.
పట్టపగలే పచ్చని పంటపొలాల్లో జూదం ఆడుతూ స్థానికుల సహాయంతో కోడిపందాలు నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడి చేసారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెంటూరులో సోమవారం చోటు చేసుకుంది. వెంటూరులో గత కొంతకాలంగా కోట్లలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌పి ఆదేశాల మేరకు కాకినాడ టౌన్ సిఐ రవికాంత్, టు టౌన్ ఎస్‌ఐ ఆలి బృందం సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడి చేసింది. వెంటూరులోని చుండ్రు మల్లిఖార్జునరావు (మల్లిబాబు) అనే వ్యక్తికి చెందిన పశువులపాకలో ఫ్లడ్ లైట్‌ల వెలుతురులో కోడిపందాలు ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసారు.
ఆ ప్రాంతంలో హైటెక్ స్థాయిలో మద్యం బాటిళ్లు, కుర్చీలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వీరి నుండి రూ.2.18లక్షలనగదు, 51కోడి కత్తులు, 30 కారులు, 17 సెల్‌ఫోన్‌లు, జనరేటర్‌లు, 2 మోటార్‌సైకిళ్లు, 2 కోడిపుంజులు, 65 ప్లాస్టిక్ కుర్చీలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బలమైన ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు బడాబాబులు జూదం ఆడేందుకు తరలి వస్తున్నారు. ఇదే సామాజికవర్గానికి చెందిన డిఎస్‌పి వారికి సహకరిస్తున్నట్లు సమాచారం. అదే సామాజికవర్గం వారు వెంటూరులో అధిక సంఖ్యలో నివసిస్తుండడంతో గ్రామానికి చెందినవారెవరూ సంఘటనపై నోరు మెదిపేందుకు సాహసించడంలేదు. పోలీసుల బృందం 30వాహనాలతో పాటు 24మందిని అరెస్టు చేసింది. అయితే రాజకీయ సిఫార్సుల మేరకు ఎమ్మెల్యేను తప్పించడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు వాహనం కూడా ఉందని జిల్లా ఎస్‌పి నాగిరెడ్డి తెలిపారు.కోడి పందాలు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అనపర్తి సిఐ త్రినాధరావును విఆర్‌లో పంపామని ఎస్‌పి తెలిపారు.
రాశి ఫలాలు






