ముఖ్యాంశాలు
'కమిటీ' విచారణాంశాలు వారం తరువాతే
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ అంశంపై అన్ని వర్గాలతో విస్తృతస్థాయి సంప్రదింపులను కొనసాగించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ కమిటీ విచారణాంశాలను ప్రకటించడంలో మరికొద్ది రోజులు జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
గత నెల మొదటివారంలో జరిగిన ఎనిమిది రాజకీయ పార్టీల సమావేశంలో కుదిరిన అవగాహనకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాలు, గ్రూపులతో మరింత విస్తృతంగా చర్చలు జరిపేందుకు వీలుగా గత బుధవారంనాడు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ కమిటీ ఏర్పాటును ప్రకటించిన విషయం విదితమే. కమిటీ పరిశీలనాంశాలు ఖరారవుతున్నాయని, కమిటీ అధ్యక్షునితో సంప్రదించిన అనంతరం వాటిని ప్రకటిస్తామని కూడా ఆరోజు ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇప్పటివరకూ వాటిని ఖరారు చేసే కసరత్తు ఒక కొలిక్కి
రాలేదని అధికారికంగా తెలియవచ్చింది.
ఆదివారంనాడు హోంమంత్రి చిదంబరం నిర్వహించిన ఒక పత్రికా గోష్ఠిలో ఈ కమిటీ విచారణాంశాలకు సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానాన్ని దాటవేసే ప్రయత్నంలో యధాలాపంగా చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా ప్రభుత్వం సోమవారంనాడు వీటిని ప్రకటించబోతున్నట్లు రోజంతా రాష్ట్రానికి చెందిన ప్రైవేటు టెలివిజన్ చానళ్లలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, మద్యాహ్నం తనను కలిసిన కొందరు విలేఖరులతో అలాంటి అవకాశమేమీ లేదని హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై తేల్చిచెప్పారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ప్రభుత్వం నియమించిన కమిటీయే అయినా రాజకీయ అంశాలతో ముడివడిన విషయం కావడం వల్ల ముందుగా కాంగ్రెస్ అగ్రనేతల కోర్‌గ్రూప్ చర్చించి ఆమోదముద్ర వేసిన తర్వాతే విచారణాంశాలను ప్రకటిస్తారని ఆయన ఇష్టాగోష్ఠి సంభాషణల్లో వెల్లడించినట్లు సమాచారం.
గత శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కోర్‌గ్రూప్ సమావేశం ఈ కమిటీ ఏర్పాటు, విచారణాంశాలపై సుదీర్ఘంగానే చర్చించినప్పటికీ కమిటీ ఛైర్మన్, సభ్యులుగా నియమించాల్సిన నిపుణుల పేర్లను ఖరారు చేయడం మినహా విచారణాంశాల ముసాయిదాను ఆమోదించలేదని ఇప్పుడు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ప్రతి శుక్రవారం ప్రధాని అధికార నివాసంలో సమావేశమయ్యే కాంగ్రెస్ కోర్‌గ్రూప్ బహుశా వచ్చే సమావేశంలో ఈ విషయాన్ని పరిశీలించి విచారణాంశాలను ఖరారు చేసే కసరత్తును పూర్తిచేయవచ్చునని తాజా చెబుతున్నారు.
ఏది ఏమైనా తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమకారులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న విచారణాంశాల కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
రాశి ఫలాలు






