ముఖ్యాంశాలు
మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు
-
ముస్లిం మైనారిటీ కోటాకు హైకోర్టు నో
-
బిసి కమిషన్ నివేదికనూ తప్పుబట్టిన ధర్మాసనం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: విద్యా, ఉపాధి రంగాల్లో వెనుకబడిన ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపి రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా లేదంటూ తీర్పుచెప్పింది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు లేనందున రద్దు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. కేవలం కృష్ణన్ కమిషన్ రిపోర్టుపైనే ఆధారపడ్డారని, అది కూడా సరిగా లేదని, కేవలం ఆరు జిల్లాల్లో మాత్రమే సర్వే చేశారంటూ హైకోర్టు బీసీ కమిషన్‌ను కూడా తప్పుబట్టింది. 90 రోజుల వరకు తీర్పు అమలు కాకుండా చూడాలని హైకోర్టు అడ్వొకేట్ జనరల్ డీవీ సీతారామమూర్తి అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది.అయితేప్రభుత్వం దీనిపై 90రోజుల్లో పై కోర్టుకు వెళ్లవచ్చునని పేర్కొంది.
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎఆర్ దవేతో పాటు జస్టిస్ టి.మీనాకుమారి, జస్టిస్ బి. ప్రకాశ్‌రావు, జస్టిస్ డీఎస్‌ఆర్ వర్మ, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, జస్టిస్ వి.ఈశ్వరయ్య,జస్టిస్ గోడా రఘురాంలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ప్రకటించింది. ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులు రిజర్వేషన్లను వ్యతిరేకించగా, మరో ఇద్దరు న్యాయమూర్తులు సానుకూలంగా వ్యవహరించారు. వ్యతిరేకించిన వారిలో ప్రధాన న్యాయమూర్తి ఎఆర్.దవే, జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, జస్టిస్ టి.మీనాకుమారి, జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ గోడా రఘురాం రిజర్వేషన్లను వ్యతిరేకించగా జస్టిస్ ప్రకాశ్‌రావు, జస్టిస్ వర్మ రిజర్వేషన్లను స్వాగతించారు.
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వానికి ఒకసారి న్యాయస్థానంలో చుక్కెదురైనా అప్పటి వైఎస్ ప్రభుత్వం తిరిగి 2007లో ఆర్డినెన్స్ జారీ చేసి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించారు. ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ వీహెచ్‌పీ నాయకుడు టి.మురళీధర్‌రావు మొదట హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తరువాత ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. మొదట ఈ వ్యాజ్యాలను అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.సింఘ్వీ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 2007 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు ధర్మాసనం అనుమితినిస్తూ ఈ ప్రవేశాలన్నీ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఆ తర్వాత జస్టిస్ సింఘ్వీ పదోన్నతిపై సుప్రీం కోర్టుకు వెళ్లడంతో కేసును ఐదుగురు న్యాయమూర్తలతో కూడిన జస్టిస్ బిలాల్ నజ్కీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను చేపట్టింది. అన్ని కోర్సులకు తాము ప్రవేశాలు పూర్తి చేశామని అయితే బీఎడ్‌తో పాటు మరికొన్ని కోర్సులకు తాము ప్రవేశాలు కల్పించలేకపోతున్నామని ప్రభుత్వం ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. బీఎడ్ తదితర కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని, కానీ విద్యార్ధులకు ప్రవేశాలు మాత్రం కల్పించవద్దని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం జస్టిస్ నజ్కీ బాంబే హైకోర్టుకు బదిలీపై వెళ్లడంతో జస్టిస్ టి.మీనాకుమారి ఈ ధర్మాసనానికి నేతృత్వం వహించారు. ఈ కేసుకున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని జస్టిస్ మీనాకుమారి ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే నేతృత్వంలో విస్తృత ధర్మాసనం విచారణ ప్రారంభం కాగానే పిటిషనర్లు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే విధించాలని అభ్యర్ధించారు. ఈ అభ్యర్ధనకు ధర్మాసనం సానుకూలంగా స్పందిస్తూ ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రభుత్వ పిటిషన్‌ను విచారించి విస్తృత ధర్మాసనం ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసింది. అంతేకాకు ఈ కేసును త్వరితగతిన విచారించాలని విస్తృత ధర్మాసనానికి సూచించింది. 2008 చివరినుంచి పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించిన విస్తృత ధర్మాసనం 2009 మార్చినాటికి విచారణను ముగించింది.
ఈ కేసుకు అత్యంత ప్రాముఖ్యత ఉండడంతో సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన హేమాహేమీలైన సీనియర్ న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఈ కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఇప్పటికే రెండు సార్లు చుక్కెదురైంది.
రాశి ఫలాలు






