ముఖ్యాంశాలు
ఎవరి గోల వారిదే! రాష్ట్ర కాంగ్రెస్ గ్రూపు-రూపు
-
సమన్వయం సాధ్యమయ్యేనా!
-
కాంగ్రెస్ సమన్వయ కమిటీపై సందేహాలు
-
నాడు మూడు గ్రూపులు
-
నేడు తొమ్మిది పైమాటే
-
ఎవరి సొంత అజెండా వారిదే
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపులపై ఆందోళనతో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ వల్ల ఎలాంటి ప్రయోజనాలు నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. అసలు ఈ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కన్వీనర్ డిఎస్‌కు కనిపించడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గతంలో మూడే వర్గాలుండేవి. చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డిల వర్గాలతోనే రాష్ట్రంలో ఆ పార్టీ నిర్వీర్యమైపోయింది. వర్గ విభేదాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకే 1983ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను మట్టికరిపించి తెలుగుదేశంకు పట్టం కట్టారు. కాగా ప్రస్తుతం రాష్ట్రకాంగ్రెస్‌లో పరిస్థితులు మరింతగా దిగజారాయి. ఇప్పుడు మూడో నాలుగో గ్రూపులు కాదు... ఏకంగా ఎనిమిది తొమ్మిది గ్రూపులుగా కాంగ్రెస్ విడివడిపోయింది. గ్రూపులు, గ్రూపుల్లోనే మళ్లీ గ్రూపులతో రాష్ట్ర కాంగ్రెస్ ముక్కచెక్కలైంది. కాంగ్రెస్‌లోనే తెలంగాణా కాంగ్రెస్, సమైక్యవాద కాంగ్రెస్, వైఎస్ అనుచర కాంగ్రెస్, వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్, జగన్ అనుచర వ్యతిరేక కాంగ్రెస్‌లు, డిఎస్ అనుకూల కాంగ్రెస్, మళ్ళీ కొత్తగా కెవిపి అనుచర కాంగ్రెస్... ఇలా ఎవరికి వారే తమ సొంత అజెండాలకు అనుగుణంగా కాంగ్రెస్‌లో గ్రూపులు కట్టారు.
ఇక ఆది నుంచి కాంగ్రెస్‌నే నమ్ముకున్న సంస్థాగత వాదులు మాత్రం పార్టీ అధిష్ఠానానికే కట్టుబడి ఉన్నారు. వీరొక్కరే రాష్ట్రంలో రోశయ్యను పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్నారు. వీరు మాత్రమే అసలైన కాంగ్రెస్ వాదులుగా గుర్తింపు పొందుతున్నారు. పార్టీలోని తెలంగాణా కాంగ్రెస్‌కు డిఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణాలోని వైఎస్ వ్యతిరేక కాంగ్రెస్‌కు కూడా డిఎస్సే నాయకత్వం
చేపట్టారు. తెలంగాణాలోని వైఎస్ అనుకూలవాదులకు సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్‌కు లగడపాటి రాజగోపాల్, సీమాంధ్రాలో వైఎస్ అనుకూల వర్గానికి ఆనం వివేకానందరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలతో కెవిపి తన తనకనుకూల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి వారు తమ అనుచర వర్గాలతో తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం పార్టీని గ్రూపులుగా, ముక్కచెక్కలుగా విడదీశారు. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే అధిష్ఠానం రాష్ట్రంలో అన్ని గ్రూపులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. దీని ద్వారానైనా పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
రాశి ఫలాలు






