బిజినెస్
దశలవారీగా ఉద్దీపన పధకాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 : అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్దీపన పథకాలను దశలవారీగా ఉపసంహరించాలని కేంద్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సూచించారు.ఈనెల 26వ తేదీన పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సమర్పించే సాధారణ బడ్జెట్‌లో ఈ ఉద్దీపన పథకాలను ఉపసంహరణకు నాంది పలికే అవకాశం ఉందని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.
ఆర్థికాభివృద్ధి రేటు 7.2 శాతానికి చేరుకోవడం సంతృప్తి కలిగించే విషయమేననీ, దీనిని కాపాడుకోవడానికి ఉద్దీపన పథకాలను దశలవారీగా ఉపసంహరించవలసిన అవసరం ఎంతైన ఉందని ఆయన అన్నారు.ఆర్థిక లోటు గత సంవత్సరం ఈ ఏడాది కన్నా బాగా తక్కువని ఆయన అన్నారు.
గత సంవత్సరం అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి పరిశ్రమలు గట్టెక్కడానికి రూ.1.86 లక్షల కోట్ల ఆర్థిక రాబడిని కేంద్రం ఈ ఉద్దీపన పథకం ద్వారా వదులు కున్నదని ఆయన చెప్పారు. 2009.10లో ఆర్థికాభివృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగిందని ఆయన చెప్పారు. ఆర్థిక లోటును అదుపు చేయడం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య అనీ, దానిని సాధించేందుకు ఉద్దీపన పథకాలను దశలవారీగా తొలగించడం ఎంతైనా అవసరమని ఆయన చెప్పారు.
ఇలా ఉండగా, కేంద్ర గణాంక సంస్థ ప్రస్తుత ఆర్థికాభివృద్ధిని 7.2 శాతంగా ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం 6.7 శాతం మాత్రమే ఉంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నుంచి క్రమంగా బయటపడుతున్న మన దేశం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి ఉద్దీపన పథకాలను దశలవారీగా తొలగించడం ఎంతైనా అవసరమని ఆయన సూచించారు.
ఉద్దీపన పథకాలను కొనసాగించండి
కాగా, ఉద్దీపన పథకాలను ఈ ఏడాది కూడా కొనసాగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కేంద్ర వాణిజ్యశాఖ కోరింది.వచ్చే సాధారణ బడ్జెట్‌లో వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఉద్దీపన పథకాలను కొనసాగించడం ఎంతైనా అవసరమని కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ ఆర్థిక శాఖకు స్పష్టం చేసింది.
200910లో పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఈ ఏడాది కూడా కొనసాగించడం ఎంతైనా అవసరమని వాణిజ్యశాఖ పేర్కొంది. కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని యథాతథంగా కొనసాగించాలనీ,ఎగుమతిదారులకు 2 శాతం వడ్డీ సబ్సిడీని కొనసాగంచాలనీ, ఎగుమతి పథకాలను 201011 సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర వాణిజ్యశాఖ కేంద్ర ఆర్థిక శాఖను కోరింది.
కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లార్ గత నెలచివరలో కేంద్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి పివి భిడేని కలుసుకుని ఈ అభ్యర్ధన చేశారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి ఆనందశర్మ కూడా ఈ వారంలోనే ప్రణబ్ ముఖర్జీని కలుసుకునే అవకాశం ఉంది.2008 అక్టోబర్ నుంచి ఎగుమతుల మీద తీవ్రమైన ఒత్తిడులు పెరుగుతున్నాయి.వీటినుంచిబయటపడేందుకు ఉద్దీపన పథకాలను కొనసాగించవలసిన అవసరం ఉందని ఆర్థిక శాఖకు వాణిజ్యశాఖ సూచించింది.
గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఎగుమతులు 147.56 బిలియన్‌ల డాలర్ల నుంచి 117.58 డాలర్లకు పడిపోయింది.అయితే,గత నవంబర్‌లో ఎగుమతులు బాగా పుంజుకుని తిరిగి యథాస్థితికి చేరుకున్నాయి. పదకొండు మాసాల్లో అవి తిరిగి మామూలు స్థాయికి చేరుకున్నట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
రాశి ఫలాలు






