పతాక శీర్షిక
విసిలకు గవర్నర్ సీరియస్ క్లాస్
-
అకడెమిక క్యాలెండర్ పకడ్బందీగా అమలు చేయాలి
-
పరీక్షలు, ఫలితాల తేదీలు ముందే ప్రకటించాలి
-
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే విసిలపై చర్య తప్పదు
-
విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడవలసినబాధ్యత విసిలదే
-
రాష్ట్రస్థాయి ఉప కులపతుల సదస్సులో గవర్నర్ ఉద్బోధ
హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రతినిధి: రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్లకు గవర్నర్ ఇ ఎల్ నరసింహన్ గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో సోమవారం జూబ్లిdహాలులో జరిగిన ఉపకులపతుల సదస్సును ప్రారంభించిన గవర్నర్ వారి పనితీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తి పేరుతో విశ్వ విద్యాలయాల్లో విసిలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని నరసింహన్ హెచ్చరించారు. ప్రతి మూడు నెలలకోసారి వర్సిటీల పనితీరు ప్రగతిపైనా నివేదిక తెప్పించుకుంటానని ఆయన తెలిపారు.
ఈ సదస్సులో పాల్గొన్న రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంద్రి డి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌కెసిరెడ్డి ఇతర శాఖల అధికారుల సమక్షంలో తనదైన శైలిలో విశ్వ విద్యాలయాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ వాటికి ప్రత్యేక ప్రణాళిక నిర్దేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కోర్సుల ప్రవేశం మొదలు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వరకూ వార్షిక ప్రణాళిక ప్రకటించారు. నిర్దేశిత క్యాలండర్ ప్రకారమే తరగతుల బోధన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి జరగక పోతే లక్షలాది మంది విద్యార్థులు తమ విద్యా సంవత్సరం నష్ట పోవడంతోపాటు భవిష్యత్‌లో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. కనుక ఈ విషయమై విసిలు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ పకడ్బందీగా సక్రమంగా పరీక్షల నిర్వహణకు బాధ్యత వహించాలని సూచించారు. లేని పక్షంలో విసిలపై చర్య తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. విశ్వ విద్యాలయాలకు అవసరమైన స్వయం ప్రతిపత్తిని జవాబు దారీ తనంతో వ్యవహరిస్తూ సక్రమ మార్గంలో వినియోగించుకోవాలే గానీ దీన్ని అడ్డం పెట్టుకుని విసిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగని మూల్యం చెల్లించక తప్పదని ఆయన తెలిపారు. స్వయం ప్రతిపత్తిని విసిలు తమకు నచ్చిన విధంగా దుర్వినియోగం చేస్తే భవిష్యత్ పరిణామాలకు వారే బాధ్యులవుతారని చెప్పారు.
విశ్వ విద్యాలయాలకు యాజమాన్యం వంటి వారైన ఉప కులపతులు తమ పదవీ కాలంలో అన్ని రంగాల్లో వాటిని అభివృద్ధి చేయాలన్నారు. నిర్దేశిత లక్ష్యాలు, గమ్యాలు చేరక పోతే విసిలకు 'ఉచిత బోజనం' ఉండదన్నారు. విశ్వ విద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి ఆలనాపాలనా కూడా విసిలదేనని ఆయన తెలిపారు. విద్యార్థి సంపూర్ణ విద్యావంతుడిగా మారినప్పుడే విద్యా ప్రమాణాలు మెరుగు పడినట్లవుతుందని నరసింహన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగ పడే విధంగా తీర్చి దిద్దాలని ఆయన సూచించారు. విద్యార్థుల పురోభివృద్ధికి తరచూ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, విద్యా ప్రమాణాల మెరుగుదల చర్యలపై నిరంతర నిఘా ఉంచాలని గవర్నర్ ఆదేశించారు. విద్యా ప్రమాణాలను సమైక్య దృష్టితో చూడాలని ఆయన సూచించారు. విశ్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆయన చెప్పారు. మౌలిక వసతుల వివరాలు ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులోకి తేవాలని తెలిపారు. ఆర్థిక పరమైన విషయాల్లో ముందు చూపుతో కూడిన క్రమశిక్షణ పాటించాలని హుకూం జారీ చేసిన గవర్నర్ ఓ పద్దతి ప్రకారం నిధులు వినియోగించాలని చెప్పారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విశ్వ విద్యాలయాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులపై అధ్యయనం చేసి, ఆ మేరకు ప్రణాళికా బద్ధంగా ప్రభుత్వాన్ని నిధులు కోరాలని సూచించారు.
ఆర్థికపరమైన విషయాల్లో కూడా విశ్వవిద్యాలయాలకు ముందు చూపు ఉండవలసిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్య వ్యాప్తి - సంస్కరణలకు ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తున్నా ఓ పద్దతి ప్రకారం వినియోగించడం లేదన్నారు. విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాల నిర్వహణకు, జీతభత్యాలకు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అధ్యయనం చేసిన తరువాతే అవసరమైన నిధులు ప్రభుత్వాన్ని కోరాలని చెప్పారు. విద్యా సంవత్సరం చివరిలో హడావుడిగా నిధుల వ్యయం గానీ, మురిగి పోవడం కానీ జరుగుతున్నాయని, ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదన్నారు. విశ్వవిద్యాలయాల్లో నిధులు దుర్వినియోగమైతే ఉపేక్షించబోమని చెప్పారు. ఇక నుంచి ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. యుజిసి నిబంధనల ప్రకారం తమ పరిధిలోని కళాశాలలు కోర్సులు నిర్వహిస్తున్నాయా, ఆయా కోర్సులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల అనుమతి ఉందా? లేదా? అన్న విషయాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని నరసింహన్ సూచించారు. ముఖ్యంగా పలు బోగస్ విశ్వవిద్యాలయాల శాఖలు, కళాశాలల వివరాలు విద్యార్థులకు సుస్పష్టంగా తెలియ చేయాలన్నారు. కేవలం ఎనిమిది నిముషాల సేపు మాత్రమే మాట్లాడిన గవర్నర్ లౌక్యంగా మాట్లాడే అలవాటు తనకు లేదని, తాను నేరుగా మొహం మీదే మాట్లాడడం వల్ల కొంత మంది విసిలకు కఠినమనించినా కొన్ని విపత్కర పరిస్థితుల్లోనే అలా వ్యవహరించాల్సి వచ్చిందని చెప్పారు.
నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగాలుండవ్!
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాలు ఉండవని విసిలను గవర్నర్ హెచ్చరించారు. నాణ్యమైన విద్యపై అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సాంకేతిక, ప్రాథమిక విద్యా రంగంలో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్‌వైపు చూస్తున్న విషయం పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ చెప్పారు. ఉన్నత విద్యపై రాజీ పడితే విసిలదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలలకోసారి తనకు పంపే నివేదికలు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి పంపాలన్నారు. ముందుగా తయారు చేసి తెచ్చుకున్న ప్రసంగ పాఠాన్ని పక్కన బెట్టి తనదైన శైలిలో మాట్లాడిన గవర్నర్ తీరుపై పలువురు విశ్వ విద్యాలయాల కులపతులు పెదవి విరిచారు. ప్రతి మూడు నెలలకు బదులు ఆరు నెలలకోసారి నివేదిక ఇస్తే ఎలా ఉంటుందని ఒకరిద్దరు ఉప కులపతులు ప్రస్తావించారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్తరంజన్ బిశ్వాల్, కళాశాల విద్యా కమిషనర్ అదర్ సిన్హా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం, గవర్నర్ కార్యదర్శి రమేష్ కుమార్, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు, తాతాజీ, కార్యదర్శి ఎండి కిస్టోఫర్ పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయాల పనితీరుపై మూడు కమిటీలు : కెసిరెడ్డి
గవర్నర్ నరసింహన్ సూచన మేరకు విశ్వ విద్యాలయాల పనితీరుపై మూడు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కెసిరెడ్డి తెలిపారు. విసిల సదస్సు ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడిన కెసిరెడ్డి, వర్సిటీల అకడమిక్ క్యాలెండర్, సౌకర్యాలు, విద్యా ప్రమాణాలు, నిధుల కేటాయింపు - ఖర్చులపై కమిటీలు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాశి ఫలాలు






